Home Page SliderTelangana

HMDA పగ్గాలు ఆమ్రపాలి చేతికి..మహానగరంపై ప్రత్యేకదృష్టి

HMDA పగ్గాలు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి చేతికి అప్పగించింది కొత్త ప్రభుత్వం. మహానగరానికి ఆయువుపట్టయిన మహానగరాభివృద్ధి సంస్థపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వ సర్వీసులలో ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేసి వచ్చిన ఆమ్రపాలి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం. గురువారం ఆమ్రపాలి ముఖ్యమంత్రిని కలిసినప్పుడే ఆమెకు పెద్ద బాధ్యతనే అప్పగిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అందుకు తగినట్లే ఆమెకు అత్యంత ముఖ్యమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పగ్గాలనే అప్పగించారు. జాయింట్ కమీషనర్‌గా ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోటిన్నర జనాభా ఉన్న ఈ మహానగరం త్వరలోనే 3 కోట్లమందికి పెరుగుతుందని ఒక అంచనా. అలాగే ఏడు జిల్లాలతో, 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో మహానగరంగా మారింది హైదరాబాద్. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ టౌన్‌షిప్‌లు, శంషాబాద్ వరకూ మెట్రో రైలు నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. 2019 నుండి కమీషనర్‌గా ఉన్న అర్వింద్ కుమార్‌ను కొనసాగిస్తారా లేదా మరో కొత్త కమీషనర్‌ను నియమిస్తున్నారా అనేది సస్పెన్సుగా మారింది. అర్వింద్ హయాంలోనే వేలం ద్వారా వందలకోట్ల విలువైన భూముల అమ్మకాలు, రింగ్ రోడ్ లీజు వంటి ప్రాజెక్టులు జరిగాయి. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. రెండు రోజుల్లో అమ్రపాలి బాధ్యతలు నిర్వహించబోతున్నారు.