Home Page SliderNews AlertTelangana

రామోజీరావు, శైలజాకిరణ్‌లకు హైకోర్టులో ఊరట

తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఛైర్మన్‌ రామోజీరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌లకు ఊరట లభించింది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ వ్యవహారంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఏపీలో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌కు చెందిన అనేక బ్రాంచిల్లో సోదాలు జరిగాయి. దీనిపై రామోజీరావు, శైలజాకిరణ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నేటి విచారణలో మార్గదర్శి తరఫున సుప్రీంకోర్ట సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. తమ క్లయింట్లపై వేధింపుల్లో భాగంగానే ఈ సోదాలు జరిగాయని కోర్టుకు తెలిపారు. చిట్‌ ఫండ్‌ నిధులను ఇతర మ్యూచువల్‌ ఫండ్లకు బదిలీ చేశారన్న ఆరోపణలపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. నిధులను ఈ విధంగా మళ్లిస్తే దాన్ని నిధుల దుర్వినియోగం అనలేమని పేర్కొంది. ఖాతాదారులను మోసం చేశారని భావించలేమని తెలిపింది. మార్గదర్శి ఖాతాదారులెవరూ కూడా ఫిర్యాదు చేయకపోయినా, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.