గచ్చిబౌలి భూముల పనులకు హైకోర్టు బ్రేక్..
హైదరాబాద్ గచ్చిబౌలి భూములపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంగా వట ఫౌండేషన్, హెచ్సీయూ విద్యార్థులు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై నేడు వాదనలు విన్న ధర్మాసనం రేపటి వరకూ పనులు ఆపాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాలను కొట్టి వేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని, వన్యప్రాణులు ఉన్న చోట వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ ఈ భూమిని 2004లోనే ఐఎంజీ అకాడమీకి అప్పగించారని, అప్పటి ప్రభుత్వం తిరిగి ఈ కేటాయింపును రద్దు చేసిందని పేర్కొన్నారు. ఇది అటవీ భూమి కాదని, హైదరాబాద్లో చాలా చోట్ల జంతువులు, చెట్లు ఉన్నాయని, ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదా అంటూ వాదించారు. దీనితో ప్రస్తుతానికి విచారణను వాయిదా వేస్తూ పనులు ఆపాలని ధర్మాసనం పేర్కొంది.