Andhra PradeshcrimeHome Page Slider

హలో.. నీ భర్త బాధ వదిలింది..!..

మృతుడు చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ, బొబ్బిలిపేటకు చెందిన చింతాడ బాలమురళీకృష్ణ మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. వీరి విషయం చంద్రయ్యకు తెలియడంతో అతడ్ని హతమార్చాలనుకున్నారు. ఆ మేరకు బాలమురళీకృష్ణ తమ్ముడు వరసైన అరవిందుతో కలిసి ప్రణాళిక రచించాడు. ఉప్పినవలస గ్రామానికి చెందిన ఏడుగురు యువకులకు సుపారీ ఇచ్చారు. వారు మూడు సార్లు హత్యకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. జనవరి 25న రాత్రి 7 గంటల సమయంలో చంద్రయ్య ఇంటి నుంచి బయలుదేరిన విషయాన్ని ఈశ్వరమ్మ మురళీకృష్ణకు ఫోన్‌లో చేరవేసింది. అప్పటికే జగ్గువాని చెరువు వద్ద ఉన్న వారంతా ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యను తలపై బీరు సీసాతో కొట్టారు. చెరువులో దూకి పారిపోయేందుకు ప్రయత్నించినా వదల్లేదు. కర్రలతో చనిపోయే వరకు కొట్టారు.

అనంతరం మెడకు గోనె సంచిని బిగించి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత మురళీకృష్ణ ఈశ్వరమ్మకు ఫోన్‌ చేసి ‘నీ భర్త బాధ వదిలిపోయింది’ అని చెప్పాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నిందితురాలు స్థానిక పోలీసుస్టేషన్‌లో భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. చంద్రయ్య మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిగ్గు తేల్చారు. కేసులో చంద్రయ్య భార్యతో పాటు మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించారు. ఎంతో చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్సైలు బాలరాజు, సత్యనారాయణ, ప్రవల్లిక, హైమావతి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.