ఢిల్లీలో భారీ వర్షం..విమానాశ్రయంలో ఈదురుగాలికి కూలిన పైకప్పు
మొన్నటి వరకూ హీట్ వేవ్స్‌తో, నీటి ఎద్దడితో అల్లాడిపోయిన ఢిల్లీని వరుణదేవుడు కరుణించాడు. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురుగాలులకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్1 పై కప్పు కూలిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు తమకు సమాచారం తెలిసినట్లు అధికారులు తెలిపారు. ఈ కప్పు పలు కార్లపై, ట్యాక్సీలపై పడడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాటి శిధిలాల కింద ఒక వ్యక్తి చిక్కుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దీనితో టెర్మినల్ 1 నుండి బయలుదేరే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనను స్వయంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, టెర్మినల్ 1 వద్ద ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.

