NewsNews AlertTelangana

ఓల్డ్‌ సిటీలో భారీగా పోలీసులు

అల్లర్లతో అడ్డుకుతున్న పాతబస్తీలో పోలీసులను భారీగా మోహరించారు. వేలాది మంది రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌లను రంగంలోకి దించారు. పాతబస్తీ గల్లీల్లో పోలీసు వాహనాలు సైరన్లతో చక్కర్లు కొట్టాయి. ఆందోళనకారులను దొరికిన వారిని దొరికినట్లే పోలీసులు చితకబాదారు. బుధవారం అర్ధరాత్రి ఆందోళనకారుల ఇళ్లలోకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. షాయినాయత్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ పార్టీ యువ నాయకుడి ఇంటిపై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు, నాయకుడి అనుచరులు రావడంతో ఆందోళనకారులు పారిపోయారు.

ఓ వైపు గణేష్‌ ఉత్సవాలు సమీపిస్తున్నాయి. మరోవైపు పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. పోలీసు అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని పెంచారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను భారీగా పెంచారు. హైదరాబాద్‌ పశ్చిమ, దక్షిణ మండల పరిధిలో దుకాణాలు, హోటళ్లను మూడు రోజుల పాటు 7-8 గంటలకే మూసేయాలని పోలీసులు ఆదేశించారు.

ఎలాంటి ర్యాలీలకు అనుమతించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ముందస్తు చర్యగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. మీర్‌చౌక్‌, చార్మినార్‌, గోషామహల్‌ జోన్లలో 360 మంది ఆర్‌ఏఎఫ్‌ బలగాలు పహారా కాస్తున్నాయి. పెట్రోల్‌ బంకులు, ఎల్పీజీ స్టేషన్లను మూసేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైన చోట్లలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తామని, వాహనదారులు సహకరించాలని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. మొత్తానికి పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.