జొమాటోలో హెల్తీ మోడ్ ఫీచర్
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరికొత్త ఫీచర్‌తో ముందుకువచ్చింది. వినియోగదారులు ఆర్డర్ చేసేటప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎంచుకునేలా హెల్తీమోడ్ ను తీసుకువచ్చింది. ఈ మోడ్‌తో ఎంచుకున్న ఆహారంలోని పోషక విలువల రేటింగ్‌ను తెలుసుకోవచ్చు. యూజర్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపేలా గతంలో కూడా జొమాటో ఒక ఫీచర్ ను తీసుకువచ్చింది. ఉదాహరణకు స్వీట్ తినాలనుకుంటే తక్కువ కేలరీలు ఉన్న స్వీట్ ను ఎంపిక చేసేందుకు ఛాయిస్ చూపించేది. ఇప్పుడు ఈ హెల్తీ మోడ్ తో మరింత ఈజీగా మంచి ఆహారం ఎంపిక చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ప్రొఫెషనల్ అథ్లెట్లు కూడా తినేలా తాము హెల్తీమోడ్ను రూపొందించామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘‘కస్టమర్లు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడాన్ని జొమాటో ఈజీ చేసింది. అయితే ఇప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం గురించి తెలియజేసే విషయంలో మాత్రం తగిన సదుపాయం లేదు. ఇది నన్ను ఆలోచింపచేసింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు హెల్తీమోడ్ను తీసుకువస్తున్నాం. ఈ మోడ్‌లోని ప్రతీ వంటకానికి ఒక స్కోర్ ఉంటుంది. ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్ ఆధారంగా లో-సూపర్ స్కోర్ కనిపించనుంది. ప్రస్తుతం ఇది గురుగ్రామ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇతర నగరాల్లో సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీనిని ప్రయత్నించండి. ఏవైనా లోపాలు ఉంటే చెప్పండి. ‘బెటర్ ఫుడ్ ఫర్ మోర్ పీపుల్’ అనేదే మా లక్ష్యం అంటూ రాసుకొచ్చారు.