సుకుమార్ వల్లే నేషనల్ అవార్డు
జాతీయ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే అలియా భట్, కృతి సనన్‌లు కూడా అవార్డు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. అందులో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
జాతీయ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఇంత గొప్ప గుర్తింపునిచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నేను సాధించిన మైలురాయి మాత్రమే కాదు.. మన సినిమాను ఆదరిస్తూ.. సపోర్ట్ చేసిన వారందరికీ చెందుతుంది. అలాగే దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నా విజయానికి ఆయనే కారణం అని బన్నీ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అవార్డు విజేతలతో ఆయన దిగిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇవి ఎంతో అందమైన, అరుదైన క్షణాలు అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు అభిమానులు స్పందిస్తూ.. బన్నీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.
జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం: అలియా భట్
ఇక గంగూభాయి కాఠియావాడిలో అద్భుతమైన నటనకు గాను బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు తన పెళ్లి చీరలో వచ్చి అందరినీ ఆకర్షించారు. తాజాగా ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె.. ఈ ఫొటోలు, ఈ క్షణం, ఈ జ్ఞాపకం.. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై బాలీవుడ్ ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు.
అలాగే సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డు అందుకున్న కృతి సనన్ కూడా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతి పెద్ద మూమెంట్ అని క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవార్డు విజేతలు దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్, అలియా భట్, కృతి సనన్ కలిసి దిగిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.

