చదువులో వెనుకబడ్డారని కిరాతకంగా చంపేశాడు
కంటికి రెప్పలా కాపాడుతూ.. కొడుకులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన తండ్రి పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పిల్లల కాళ్లు చేతులు తాళ్లతో కట్టి నీళ్ళల్లో ముంచి తండ్రి చంద్ర కిషోర్ చంపిన తీరు అందరినీ. భయభ్రాంతులకు గురిచేసింది. ఇద్దరు పిల్లలను చంపి తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రకిషోర్ సూసైడ్ నోట్ లో రాశాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 
							 
							