home page sliderHome Page SliderInternational

రైఫిల్స్‌ తిరుగుబాటు వెనుక హసీనా ..

బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు కేసు మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణదండన విధించిన నేపథ్యంలో, 2009లో జరిగిన బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు పై కొత్త దర్యాప్తు కమిషన్ విడుదల చేసిన నివేదిక దేశ రాజకీయాలను కుదిపేసింది. ఈ నివేదికలో హసీనానే తిరుగుబాటుకు స్వయంగా ఆదేశాలు ఇచ్చారని, తిరుగుబాటును ఆవామీ లీగ్ నాయకుల సహకారంతో నడిపించారని పేర్కొన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కమిషన్ నివేదిక ప్రకారం, అప్పట్లో హసీనా ప్రభుత్వంతో అనుబంధం ఉన్న మాజీ ఎంపీ ఫజ్లే నూర్ తపోష్ తిరుగుబాటును ముందుండి నడిపించాడని పేర్కొంది. రెండు రోజులపాటు సాగిన ఈ ఘటనలో అగ్రసైనికాధికారులు సహా మొత్తం 74 మంది ప్రాణాలు కోల్పోయారు. విచారణలో హత్యలు, దాడులు, అంతర్గత మోసం వంటి అంశాలు ప్రస్తావించబడగా, ఈ మొత్తం పరిణామానికి హసీనా బాధ్యత వహించాల్సిందిగా నివేదికలో పేర్కొనడం బంగ్లాదేశ్ రాజకీయాలలో మరింత కలకలం రేపుతోంది.
కమిషన్ నివేదికలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తిరుగుబాటు సమయంలో హసీనాకు భారత్ మద్దతు ఇచ్చిందని, బంగ్లాదేశ్‌లో అస్థిరతను సృష్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించింది. అప్పట్లో 921 మంది భారతీయులు ఢాకాకు వచ్చినట్లు, వారిలో కొంతమందిపై సమాచారం ఇంకా స్పష్టంగా లేదని నివేదిక చెప్పింది. ఈ ఆరోపణలపై భారత్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
విద్యార్థి నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, గత ఏడాది ఆగస్టు 5న ఆమె బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వెళ్లారు. అప్పటి నుండి ఢిల్లీ‌లోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నట్లు సమాచారం. హసీనా పలు కేసుల్లో దోషిగా ఉన్నందున, ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను పలుమార్లు కోరింది. ఈ పరిణామాలు దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.