బలూచిస్తాన్.. పాక్ నుండి నిజంగా విడిపోయిందా?
పాకిస్తాన్‌కి దశాబ్దాలుగా పక్కలో బల్లెంలా ఉన్న బలూచిస్తాన్ ఇటీవల స్వతంత్య్రం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజంగా పాకిస్తాన్ నుండి విడిపోయిందా? స్వతంత్ర్యదేశంగా దానికి గుర్తింపు వచ్చిందా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌లో పరిస్థితులు బాగా దిగజారిపోయాయి. ఒక పక్క భారత్ వైమానిక దాడులు చేస్తూంటే మరోపక్క బెలూచిస్తాన్ తిరుగుబాటు దారులు పాక్ దళాలను ఊచకోత కోశాయి. ఈ నేపథ్యంలో బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ రజాక్ బలూచ్ మాటలు వైరల్ అవుతున్నాయి. బలూచిస్తాన్‌లో 80 శాతం ఇకపై పాక్ నియంత్రణలో లేదని ఆయన పేర్కొన్నారు. ‘రాత్రయితే పాక్ సైన్యం క్వెట్టా నుండి బయటకు రావడానికి భయపడుతుందని, కనీసం గస్తీ కూడా నిర్వహించలేదని’ స్పష్టం చేశారు. బలూచ్ పోరాటానికి భారత్, అమెరికా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మద్దతు ఆలస్యం చేస్తే అనాగరిక సైన్యం ఆవిర్భావం జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమం ఊపందుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ యోధులు పాకిస్తాన్ సైన్యం, చైనా ప్రాజెక్టులపై నిరంతరం దాడి చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బలూచ్ నాయకుడు మీర్ యార్ భారత్‌కు మద్దతు ప్రకటిస్తూ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి, ‘మోదీ మీరు ఒంటరివారు కారు, మీకు బలూచ్ దేశభక్తుల మద్దతు ఉందని’ ప్రకటించాడు. న్యూఢిల్లీలో బలూచ్ రాయబార కార్యాలయాన్ని అంగీకరించాలని కోరాడు.