హరీశ్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మనోవేదనలో ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ ఇవ్వలేదని, తక్షణమే దానిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడం వల్ల సుమారు 39 మంది వైద్యం అందక మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారుస్తామన్న హామీని నెరవేర్చలేదని, పోలీసులకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల గురించి హరీశ్ రావు మాట్లాడటం చూస్తుంటే “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది” అంటూ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసని, ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జీరో అవర్‌లో సభ్యులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు

