NationalNews Alert

భర్తకు భార్య వేధింపులు- జంబలకిడి పంబ

కొన్ని సంఘటనలు తేడాగా, వింతగా కనిపించినా వాటిలో కూడా నిజాలు ఉంటాయి. ఇలాంటి సంఘటనే బిలాస్‌పూర్‌లో జరిగింది. ఎప్పుడూ భార్యను వేధించే భర్తలపై,  భార్యలు కోర్టులకు వెళుతూ ఉంటారు. కానీ భర్తను వేధించే భార్యనుండి విడాకులు కోరుతూ ఒక భర్త కోర్టుకెక్కాడు. వివరాలలోకి వెళితే  చత్తీస్ గఢ్‌లోని ధంతరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం రాయ్‌పుర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనను చాలా వేధిస్తోందని, కనీసం తన తల్లిదండ్రులను కూడా కలుసుకోనివ్వడం లేదని, తనకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఆఫీసుకు వచ్చి తన పరువుతీస్తోందని పేర్కొంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించి 2019లో వారికి విడాకులు మంజూరు చేసారు.

అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అతని భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలీ కోర్టులో తన భర్త తప్పుడు సాక్ష్యాలు చూపించారని, తనకు విడాకులు వద్దని పిటిషన్ దాఖలు చేసింది. అయితే తనను భార్య ఆఫీసుకు వచ్చి అసభ్య పదజాలంతో దూషించందని, తన పరువుకు భంగం కలిగిందని, తనను బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిందని బాధను వ్యక్తం చేసాడు భర్త. దీనితో ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను బట్టి హైకోర్టు ఈ విడాకులను సమర్థించింది. అతని ఆఫీసులో పరువుతీయడం, తల్లిదండ్రులను కలుసుకోకుండా చేయడం, అక్రమ సంబంధం అంటగట్టడం వంటివి చాలా తీవ్రమైన విషయాలని హైకోర్టు స్పష్టం చేసింది.