Home Page Sliderhome page sliderInternationalTelangana

హైదరాబాద్ లోనే హెచ్–1బీ వీసా మోసాలు

అమెరికాలో హెచ్–1బీ వీసా మోసాలకు ప్రధాన కేంద్రం హైదరాబాద్ అని అమెరికా మాజీ దౌత్యవేత్త మహవేష్ సిద్ధిఖీ సంచలన ఆరోపణలు చేశారు. అమీర్‌పేట్‌లో వీసా ఆసక్తిగల వారికి బహిరంగంగా శిక్షణ ఇస్తున్న సెంటర్లు నకిలీ ఉద్యోగ పత్రాలు, విద్యా ధృవీకరణ పత్రాలు, నకిలీ వివాహ డాక్యుమెంట్లు కూడా విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.భారతీయులకు కేటాయించిన వీసా కోటాలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, వీసా ప్రక్రియ ఇండస్ట్రియల్ స్థాయిలో మోసాలకు గురైందని అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యుడు డాక్టర్ డేవ్ బ్రాట్, అమెరికా మాజీ దౌత్యవేత్త మహవేష్ సిద్ధిఖీ బుధవారం ఆరోపించారు. స్టీవ్ బాన్నన్ నిర్వహించిన ‘వార్ రూమ్’ పాడ్‌క్యాస్ట్‌లో డాక్టర్ డేవ్ బ్రాట్ మాట్లాడుతూ, భారతదేశం నుంచి హెచ్–1బీ వీసాల కేటాయింపులు చట్టబద్ధమైన పరిమితులను దాటి పోతున్నాయని విమర్శించారు.ఒకే ప్రాంతానికి నిబంధనలకు మించి రెట్టింపు కంటే ఎక్కువ వీసాలు కేటాయించడం అనుమానాలకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హెచ్–1బీ వ్యవస్థపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు కారణమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలపై కఠిన వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్తులో భారత్‌కు కేటాయించే హెచ్–1బీ కోటా తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెచ్–1బీ వీసాలలో 71 శాతం భారతీయులకే జారీ అవుతుండడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోందని తెలిపారు. చైనా వాటా కేవలం 12 శాతం మాత్రమేనని చెప్పారు. హెచ్–1బీ వీసాలకు వార్షిక పరిమితి 85,000 ఉండగా, చెన్నై కాన్సులేట్ ఒక్కచోటే 2,20,000 హెచ్–1బీ వీసాలను ప్రాసెస్ చేయడం కాంగ్రెస్ నిర్దేశించిన పరిమితికి రెండున్నర రెట్లు ఎక్కువని ఆరోపించారు. “ఈ మోసాలే అమెరికా కార్మికులకు నేరుగా ముప్పు” అని బ్రాట్ వ్యాఖ్యానించారు.

వీసా పొందే కొంతమంది భారతీయులు తాము ఉన్నత నైపుణ్యాలు కలిగినవారమని చెబుతున్నప్పటికీ, అందుకు తగిన అర్హతలు లేకపోవడం అమెరికా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు. “ఈ మోసం అమెరికన్ల ఉద్యోగాలు, కుటుంబాలు, ఇళ్లపై కూడా ప్రభావం చూపుతోంది. దీన్ని ఆపాల్సిన సమయం వచ్చింది” అని బ్రాట్ అన్నారు. చెన్నై యూఎస్ కాన్సులేట్ 2024లో 2,20,000 హెచ్–1బీ వీసాలతో పాటు 1,40,000 హెచ్–4 డిపెండెంట్ వీసా దరఖాస్తులను కూడా స్వీకరించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలో వస్తాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా హెచ్–1బీ వీసాలను ప్రాసెస్ చేసే కాన్సులేట్‌లలో ఒకటిగా గుర్తించబడింది.

ఇదే ఆరోపణలను అమెరికా విదేశీ సేవలలో పనిచేసిన భారత సంతతికి చెందిన అధికారి మహవేష్ సిద్ధిఖీ కూడా మరోసారి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. 2005–2007 మధ్యకాలంలో తాను పరిశీలించిన 51,000 నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల్లో ఎక్కువ భాగం హెచ్–1బీ వీసాలేనని, వాటిలో 80–90 శాతం దరఖాస్తుల్లో నకిలీ డాక్యుమెంట్లు ఉన్నాయని ఆమె తెలిపారు. తప్పుడు డిగ్రీలు, నైపుణ్య ధృవపత్రాలు, నకిలీ ఉద్యోగ పత్రాలు విస్తృతంగా వినియోగించబడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.