గురుమూర్తి మామూలోడు కాదు గురూ..!
కిరాతక హంతకుడు,నరరూప రాక్షసుడు,మృగాడు…ఇలా ఎన్ని పేర్లు పెట్టినా గురుమూర్తి పాల్పడిన దారుణం ముందు అవన్నీ చిన్నబోక తప్పదు. స్త్రీ హత్య,బ్రహ్మ హత్య,మార్జలం హత్య మహా పాతకమని వేదాలు,పురాణాలు చెబుతున్నా… గురుమూర్తి మాత్రం సాక్షాత్తు గురుదేవుని పేరు పెట్టుకుని మరీ దారుణ హత్యకు పాల్పడ్డాడు. నాయక్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసిన జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగ్ మాదిరిగా…..అల్లుడు నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ కావాలన్నట్లుగా ప్రస్తుతం గురుమూర్తి చేసిన హత్యే ఇండియాలో హైలైట్‌గా నిలవబోతుంది. గురుమూర్తి చేసిన హత్య తాలూకా ఆధారాలు సేకరించడానికి వారాల తరబడి సమయం పడుతుందంటే ఇక ఏ రేంజ్‌లో ఈ హత్యను ప్రీ ప్లాన్డ్ గా చేశాడో అర్ధం అవుతుంది.భార్య వెంకట మాధవిని చంపడానికి వారం రోజుల ముందే ఓ కుక్కను చంపడం,యూ ట్యూబ్‌లో దృశ్యం,సూక్ష్మ దర్శిని లాంటి సినిమాలు పదే పదే వీక్షించడం, యాసిడ్ తరహా రసాయనాలు తెచ్చి మాధవి మాంసం ముక్కలను అందులో వేసి ఎముకలుగా మార్చడం, వాటిని పొడి చేయడం …అబ్బో ఈ హత్య గురించి వింటుంటేనే ఒకింత ఏహ్యతా భావం,మరో వైపు తీరని భయం వెంటాడుతున్నాయి ప్రతీ ఒక్కరిని.ఇలాంటి గురుమూర్తిపై పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టి సరైన ఆధారాలు సేకరించి ఉరి శిక్ష వేయించే పనిలో పడ్డారు.ఇందులో భాగంగా ఆదివారం పలు కీలక ఆధారాలు సేకరించారు.వాటిని సోమవారం న్యాయమూర్తి ఎదుట ప్రదర్శించబోతున్నారు.

