గిన్నిస్ రికార్డు సాధించిన ‘ఇన్‌స్టాగ్రామ్ రీల్’
కేరళకు చెందిన 21 ఏళ్ల ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్ ఆటగాడు రిజ్వాన్ స్టార్ ప్లేయర్, కంటెంట్ క్రియేటర్‌గా పాపులర్ అయ్యారు. 2023 నవంబర్‌లో ఒక ఇన్‌స్టా రీల్ పోస్ట్ చేశారు. ఈ రీల్ అప్పటి నుండి వైరల్ అవుతూ వచ్చి గిన్నిస్ రికార్డు సాధించింది. ఏకంగా 55.4 కోట్ల మంది ఆ రీల్‌ను వీక్షించడంతో అతడే ఆశ్చర్యపోయాడు. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్‌ను పోస్ట్ చేశారు. ఈ రీల్‌లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తన్నాడు. ఆ బంతి జలపాతం వెనుకనున్న రాళ్లను తాకి ఎగిరిపడింది. ఈ రీల్ కోట్ల మంది నెటిజన్లను ఆకట్టుకుంది. 92 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. దీనితో రిజ్వాన్ చాలా సంతోషపడుతూ ఇది స్నేహితులతో సరదాగా జరిపిన వీడియో. కేవలం 10 నిమిషాల్లోనే 2 లక్షల వ్యూస్, ఇంటికి చేరేసరికే 10 లక్షల వ్యూస్‌కు చేరుకుంది అంటూ పేర్కొన్నాడు. రిజ్వాన్ ఈ ఫ్రీస్టైల్ ఫుట్‌బాల్‌లో కారు పైకప్పుపైనా, నీటి అడుగున, పర్వతాలపైనా కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.