‘ఆనందో బ్రహ్మ-2’కు పచ్చ జెండా
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్‌కు, ఫ్రాంఛైజీలకు మంచి సీజన్.. తెలుగులో పలు సీక్వెల్స్ సెట్స్ మీద వున్నాయి. ఇందులో భాగంగానే తాప్సీ కథానాయికగా నటించిన విజయవంతమైన హారర్ కామెడీ థ్రిల్లర్ ఆనందో బ్రహ్మకు సీక్వెల్ రాబోతోంది. ఇంతకు ముందు ఆనందో బ్రహ్మ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాత మహి.వి.రాఘవ ఈ సీక్వెల్‌కు సన్నాహాలు చేస్తున్నాడు. మహి.వి రాఘవ పాఠశాల వంటి యూత్‌ఫుల్ చిత్రంతో పాటు యాత్ర, యాత్ర-2 వంటి పొలిటికల్ థ్రిల్లర్స్‌కు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆనందో బ్రహ్మకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేపట్టడం జరిగింది. అయితే ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌లో నటించిన కథానాయిక తాప్సీని ఒప్పించే పనిలో వున్నాడు మహి. గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా వుంటున్నారు తాప్సీ. తెలుగులో ఆమె ఝమ్మంది నాదం, మిస్టర్ పర్‌ఫెక్ట్, మొగుడు, దరువు, సాహసం, షాడో, ఆనందో బ్రహ్మ, మిషన్ ఇంపాజిబుల్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తీయాలనే ఆలోచనలో వున్నారు దర్శక నిర్మాతలు.

