భారత్ ఫార్మాకంపెనీలు ఈ అమెరికా కొత్త చట్టంతో నక్కతోక తొక్కినట్లే…
అమెరికాలో రాబోతున్న కొత్తచట్టం వల్ల భారత్‌లోని ఫార్మా కంపెనీలకు గొప్ప అవకాశం లభించబోతోంది. అమెరికాలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇప్పటికే “బయో సెక్యూర్ యాక్ట్” అనే ఈ చట్టాన్ని ఆమోదించింది. ఇక సెనేట్ అనుమతి మాత్రమే మిగిలిఉంది. ఈ ప్రక్రియ కొన్ని నెలల్లోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనంతరం అధ్యక్షుడు సంతకం చేస్తే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం చైనాకు సంబంధించిన ఫార్మా కంపెనీలు, అమెరికా కంపెనీలతో ఒప్పందాలు కలిగి ఉండడాన్ని నిషేధిస్తోంది. చైనాలోని బీజీఐ, ఎంజీఐ, ఉగ్జి ఆప్‌టెక్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా అమెరికాలోని కంపెనీలతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది. చైనా, రష్యా, క్యూబా, ఇరాన్, నార్త్ కొరియా వంటి దేశాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఈ జాబితాలో భారత్ లేనందున అమెరికా కంపెనీలు తమ కాంట్రాక్టు తయారీ అవసరాల కోసం భారత్‌లోని ఫార్మా కంపెనీలతో సంబంధాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, చైనాతో పోలిస్తే మనదేశంలో తయారీ వ్యయాలు కూడా చాలా తక్కువ. మన ఎగుమతులలో అమెరికా వాటా ఇప్పటికే 33 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల కాంట్రాక్టు పరిశ్రమలు ఏటా 13 శాతం వృద్ధి చెందుతున్నాయి.

ఏపీ,తెలంగాణాలలోని దివీస్, అరబిందోఫార్మా, సువెన్‌ఫార్మా, లారస్, న్యూలాండ్ వంచి కంపెనీలు ఇప్పటికే ఔషధాల తయారీ, కాంట్రాక్టు రంగంలో ఉన్నాయి. తమ తయారీ, పరిశోధన సామర్థ్యాలు పెంచుకుంటే రాబోయే కాలంలో యూఎస్ కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మనదేశం నుండి అమెరికాకు ఏటా దాదాపు రూ.92వేల కోట్ల విలువైన ఔషధాల ఎగుమతులు జరుగుతున్నాయి.