Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

విశాఖలో గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్

ఢిల్లీ : ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ ప్రతినిధులతో ఈ ఒప్పందం చేసుకున్నారు. విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు గూగుల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానుంది. ఆసియాలోనే గూగుల్ కు ఇది అతి పెద్ద ప్రాజెక్టుగా మారనుంది. దీని ద్వారా ఏపీ రాష్ట్రానికి ఏటా రూ.10 వేల కోట్ల పైనే సమకూరుతుందని, అలాగే లక్షా ఎనభై వేల పై చిలుకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనాలు వేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఇదో అపూర్వ ఘట్టం అన్నారు. ఈ ఒప్పందం ద్వారా విశాఖ ప్రపంచ స్థాయి టెక్ హబ్ గా మారుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
అమెరికా వెలుపల గూగుల్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని గూగుల్ క్లౌడ్ సీఈవో కురియన్ తెలిపారు. గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ మారబోతోందని తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు ఏపీలో తయారయ్యే అవకాశం ఉందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దూరదృష్టితో ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని, 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా సగర్వంగా నిలబెట్టాలనే కల నెరవేరబోతోందన్నారు.
ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. భారత ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. విశాఖలోని గూగుల్ తొలి ఏఐ హబ్ కు సంబంధించిన ప్రణాళికలను ప్రధాని మోదీతో పంచుకున్నానని, ఈ హబ్ లో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్ సీ గేట్ వే వంటి టెక్ సంబంధమైనవే కాకుండా భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయని పేర్కొన్నారు. విశాఖ నుండి 12 దేశాలతో సబ్ సీ- కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.