ఏపీలో గూగుల్ ఏఐ సేవలు
ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థతో గురువారం చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయంగా టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కరలేకుండా సెల్‌ఫోన్ ద్వారా సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. దానికోసం పాఠశాలలు, కళాశాలలో కృత్రిమ మేధ వినియోగం, ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాల కోసం గూగుల్ సంస్థ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 10 వేల మందికి గూగుల్ నైపుణ్య శిక్షణ అందిస్తుందన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్ జనరేటివ్ ఏఐ వంటి రంగాలలో గూగుల్ సహకారం అందిస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య రంగాలు, ట్రాఫిక్ నిర్వహణ, స్టార్టప్‌ల నెట్ వర్కింగ్ వంటి అన్ని రంగాలకు ఏఐ ఆధారిత సేవలను గూగుల్ అందిస్తుందని పేర్కొన్నారు.