రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త
రాబోయే వేసవి కాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటం, మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ షాపుల వద్ద ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ వెసులుబాటు కల్పించింది. కేంద్ర పౌర సరఫరాల శాఖ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపగా, తెలంగాణ ప్రభుత్వం తన వద్ద ఉన్న నిల్వల సామర్థ్యాన్ని ,అమలు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కోటికి పైగా ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ద్వారా లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. కేంద్రం సూచనల మేరకు మూడు నెలల కోటాను ఒకేసారి ఇవ్వాలంటే భారీ స్థాయిలో బియ్యం నిల్వలు అవసరమవుతాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల రవాణా ఖర్చులు తగ్గడం, హమాలీ కూలీలు మరియు డీలర్లకు శ్రమ తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నిల్వ సామర్థ్యం లేకపోవడం డీలర్లకు ప్రధాన సమస్యగా మారింది. గతంలో వర్షాకాలంలో ఇలాగే మూడు నెలల కోటా ఇచ్చినప్పుడు నిల్వ ఉంచే చోటు లేక డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయి సాంకేతిక సమస్యలు కూడా అధికారులకు సవాలుగా మారనున్నాయి. మూడు నెలల కోటా తీసుకోవాలంటే ఒక్కో లబ్ధిదారుడు మూడుసార్లు వేలిముద్ర (థంబ్) వేయాల్సి ఉంటుంది. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డుదారుడికి 15 నుండి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగి, ఎండ నుంచి ఉపశమనం కోసం తీసుకున్న ఈ నిర్ణయం లబ్ధిదారులకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం ఈ సాంకేతిక లోపాలను సరిదిద్ది, నిల్వ సామర్థ్యంపై స్పష్టతనిస్తేనే ఈ ‘వేసవి ఉపశమనం’ పూర్తిస్థాయిలో విజయవంతమవుతుంది.

