శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుండడంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ తోపాటు తనిఖీ సమయాన్ని తగ్గించే అంశంపై టీటీడీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అలిపిరి టోల్ ప్లాజాను ఆధునికరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టోల్ ప్లాజా వద్ద అందుబాటులోకి రాబోయే ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థ ఇప్పటికే టీటీడీ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్‌కు ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించిన టిటిడి.. భక్తులకు అసౌకర్యం కలగ కుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. ఇప్పుడున్న 12 లైన్ల తనిఖీ పాయింట్లను విస్తరించి మరిన్ని తనిఖీలైన్లను అందుబాటులో తీసుకురానుంది. తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు చేయనుంది. లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్‌లను పెంచాలని భావిస్తున్న టీటీడీ లగేజ్ కన్వేయర్ బెల్ట్ లను పెంచి భద్రతా తనిఖీలో సమయాన్ని నివారించే అంశం పరిశీలిస్తోంది. అలిపిరి టోల్ ప్లాజాలో మరింత మంది భద్రతా సిబ్బందిని నియామించేందుకు కసరత్తు చేస్తోంది. రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాలపై ఫోకస్ పెట్టింది టిటిడి. భక్తుల వాహనాలు, లగేజీ ని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని భావిస్తున్నటీటీడీ.. టోల్ ప్లాజాలో శాస్త్రీయంగా స్కానింగ్ చేసేలా సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సిసి కెమెరాల ఏర్పాటు, మౌళిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది.

