రోజులో రెండుసార్లు తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ : పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఇటీవల దసరా, దీపావళి పండుగ రోజుల్లో సునామీలా ఎగిసిపడిన బంగారం ధరలు గత వారం రోజులుగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పుత్తడికి డిమాండ్ తగ్గుతోంది. మంగళవారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1.22 లక్షలు పలుకుతుండగా..22 క్యారెట్ల బంగారం 1.12 లక్షల వద్ద కొనసాగింది. అయితే విచిత్రంగా గంటల వ్యవధిలోనే రెండవసారి కూడా రేట్లు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు సాయంత్రం సమయానికి రూ.2,460 తగ్గి, రూ.1,20, 820 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములు కూడా రూ.2,250 తగ్గి, రూ.1,10,750 కి చేరింది. ఒక్క రోజులోనే ఇలా రెండుసార్లు తగ్గడం పెద్ద రికార్డు. అలాగే ఇటీవల రికార్డు స్థాయిలో కిలోకి రూ.2 లక్షలు దాటిన వెండి సైతం తగ్గుముఖం పట్టి కిలో వెండి రూ.1.50 లక్షలకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ఔన్స్ 4 వేల డాలర్ల కంటే దిగువకు చేరింది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలున్నాయన్న అంచనాలతో ధరలు దిగొచ్చాయంటున్నారు నిపుణులు.

