Breaking Newshome page sliderHome Page SliderNational

భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్

ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ తొలిసారిగా 5 వేల టన్నుల మార్క్‌ను 2025 సంవత్సరంలో దాటింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షిత మార్గంగా బంగారాన్ని భావించడంతో డిమాండ్ భారీగా పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక ప్రకారం, 2024లో 4,961.9 టన్నులుగా ఉన్న గ్లోబల్ డిమాండ్ 2025లో 5,002 టన్నులకు చేరి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.

మరోవైపు, పెట్టుబడుల రూపంలో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. 2024లో 1,185.4 టన్నులుగా ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్, 2025లో 2,175.3 టన్నులకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు గత ఏడాది మొత్తం 863 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. ఇందులో పోలాండ్ జాతీయ బ్యాంక్ అత్యధికంగా 102 టన్నుల పసిడిని సేకరించింది.
అయితే, ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా మందగించింది. పరిమాణం పరంగా డిమాండ్ 18 శాతం తగ్గినా, ధరల పెరుగుదల కారణంగా విలువ పరంగా మాత్రం అదే స్థాయిలో పెరిగింది.

భారత్‌లో మాత్రం బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. 2024లో 828.8 టన్నులుగా ఉన్న దేశీయ డిమాండ్, 2025లో 11 శాతం తగ్గి 710.9 టన్నులకు పడిపోయింది. విలువ పరంగా చూస్తే రూ.5.75 లక్షల కోట్ల నుంచి రూ.7.51 లక్షల కోట్లకు పెరిగింది.

ఆభరణాల డిమాండ్ కూడా గణనీయంగా తగ్గింది. 2024లో 563.4 టన్నులుగా ఉన్న డిమాండ్, 2025లో 24 శాతం తగ్గి 430.5 టన్నులకు చేరింది. ధరల పెరుగుదలతో విలువ మాత్రం రూ.4.54 లక్షల కోట్లకు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది అదనంగా 4 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది.