National

దీపావళిని ఇలా జరుపుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది

మనసర్కార్:

దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. లోకానికి వెలుగులు పంచే ఈ పండుగను చిన్నా పెద్దా సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. శ్రీకృష్ణుడు నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన సందర్భంగా ద్వారక ప్రజలు ఆనందంతో దీపావళిని జరుపుకున్నారని పురాణాలలో ఉంది.

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగ రోజు అమావాస్య కావడంతో సాయంత్ర సంధ్యవేళ దీపాలు వెలిగించి, ఇంటి ముందు చక్కగా వరుసలుగా పేరుస్తారు. అందుకే దీనికి దీపావళి అని పేరు వచ్చింది. దీపాలు పెట్టి లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వ్యాపారులు డబ్బును పూజలో పెట్టి పూజిస్తారు. లక్ష్మి అనుగ్రహించాలంటే పండుగ రోజు  ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. చక్కగా ముగ్గులతో, దీపాలతో, పూలతో ఇంటిని అలంకరించుకోవాలి. ఇంట్లో అందరూ చక్కగా కొత్త దుస్తులు ధరించి పద్దతిగా పూజలో పాల్గొనాలి. ఇలా చేస్తే ఆ ఇంటిలో ధనానికి లోటుండదని లక్ష్మి కటాక్షిస్తుందని అంటారు.

ఈ పూజ అనంతరం తీపి పదార్థాలు తిని, బాణాసంచా కాల్చి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ బాణసంచా కాల్చడం అంటే చిన్నపిల్లలందరికీ ఎంతో సరదా. పండుగకు కొన్ని రోజుల ముందు నుండే వాటిని కొని, స్నేహితులతో పోటీలు పడి కాలుస్తుంటారు. కాకరపువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, భూచక్రాలు, విష్ణు చక్రాలు వంటి పటాసులతో అమావాస్య నాటి ఆ రాత్రిని రంగుల హరివిల్లులతో నింపేస్తారు. ఈ దీపావళి నాడు లక్ష్మీపూజ 24 వతేదీ సోమవారం సాయంత్రం 5.30 గంటల నుండి 6.50 గంటల మధ్యలో జరుపుకోవాలి.