పోటెత్తిన గోదావరి..మహారాష్ట్ర, తెలంగాణ మధ్య బ్రేక్
భారీ వర్షాల కారణంగా గోదావరి నది పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న వంతెనపై నుంచి ప్రవాహం ఉద్ధృతమవడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంజీర, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరగడంతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం పెరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ – మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వంతెన వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బాసర వద్ద కూడా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నదిలో వరద పెరుగుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారిపై నీళ్లు రావడంతో బారికేట్లు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ వద్ద మొదటి మెట్టు వరకు వరద ప్రవహిస్తోంది. మరోవైపు శ్రీ రామ్సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, రాగల 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని, శుక్రవారం ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వానలు పడతాయని వివరించింది. బుధవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, మహబూబ్బాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

