‘జానీమాస్టర్‌ని కస్టడీకి ఇవ్వండి’..పోలీసుల పిటిషన్
టాప్ కొరియోగ్రాఫర్‌గా పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోయిన జానీ మాస్టర్ ఖ్యాతి మసకబారుతోంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురిచేసాడని, అత్యాచారం చేసాడనే ఫిర్యాదుతో కటకటాలపాలయ్యారు జానీ మాస్టర్. అతడిని కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే అతడి నుంచి కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టడానికి పోలీసులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముంబయిలోని హోటల్‌లో 2020లో జానీ బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేసి, అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతర కాలంలో కూడా పలుమార్లు ఔట్‌డోర్ షూటింగులకు వెళ్లినప్పుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీనితో మరిన్ని వివరాలు సేకరించడానికి కస్టడీ కోరుతున్నారు పోలీసులు. మరోపక్క జానీపై పోక్సో కేసు నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు అతడి న్యాయవాది. అయితే మరింతమంది మహిళా డాన్సర్లు కూడా జానీ మాస్టర్ వేధింపులకు గురయినట్లు ఫిర్యాదు ఇవ్వడానికి సిద్దమయ్యారని సమాచారం.

