నెట్‌లో ప్రియురాలి నగ్న చిత్రాలు.. డాక్టర్ హతం…
సరదా కోసం ప్రియురాలి నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ డాక్టర్ ఏకంగా తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన వికాస్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. రెండేళ్లు చెన్నైలో ప్రాక్టీసు చేసిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్యాడ్యుయేట్స్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లాడు. అక్కడ ఓ మహిళతో వికాస్ సహజీవనం చేస్తున్నాడు. వాళ్ల పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అదే సమయంలో వికాస్ బుద్ధి గడ్డితిన్నది.

సరదా కోసమే చేశాడట..
సోషల్ మీడియాలో ఓ అకౌంట్ తెరిచి తనకు కాబోయే భార్య నగ్న చిత్రాలను అందులో అప్‌లోడ్ చేశాడు. తమిళనాడుకు చెందిన కొందరు స్నేహితులకూ షేర్ చేశాడు. ఆ ఫొటోలు ఆ మహిళకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నెల 8వ తేదీన కనిపించడంతో ఆగ్రహం చెందింది. ఈ పని ఎందుకు చేశావని ప్రశ్నించిన ఆమెకు సరదా కోసమే చేశానన్న వికాస్ సమాధానంతో కోపం నషాళానికి అంటింది. ఆ మహిళ స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యల వద్ద తన ఆవేదన వెలిబుచ్చింది.

కర్రలతో చితకబాదిన స్నేహితులు..
స్నేహితుల సూచన మేరకు వికాస్‌ను ఆ మహిళ సుశీల్ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ వికాస్‌ను మహిళ స్నేహితులు కర్రలతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. వికాస్ స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల14వ తేదీన మృతి చెందాడు. వికాస్ సోదరుడు విజయ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళతోపాటు ఆమె స్నేహితులను అరెస్టు చేశారు.