అమ్మా క్షమించు.. తప్పు చేశా…
తిరుగుబాటుపై సోనియాకు గెహ్లాట్ క్షమాపణలు
రాజస్థాన్ పరిణామాలపై సోనియా ఆగ్రహం
ఢిల్లీ దూతలను కలవకపోవడంపై కస్సుబుస్సు
ఇన్నాళ్లుగా మద్దతిస్తే ఇలా చేస్తారా?
గెహ్లాట్ తిరుగుబాటుతో కాంగ్రెస్‌లో కల్లోలం
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి వచ్చిన కేంద్ర పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గేకి అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పారు. ఓవైపు ఢిల్లీ ప్రతినిధులు వస్తే… ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశం నిర్వహించడం, తిరుగుబాటు ప్రకటించడాన్ని ఆయన పొరపాటుగా పేర్కొన్నారు. ఇలా జరకుండా ఉండాల్సిందన్నారు. మొత్తం వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదని కూడా పార్టీ పెద్దలకు చెప్పారు. మొత్తం ఎపిసోడ్‌లో తన ప్రమేయం లేదని గెహ్లాట్ పేర్కొన్నప్పటికీ, అతని అనుమతి లేకుండా ఎమ్మెల్యేల తిరుగుబాటు జరగదని ఖర్గే అభిప్రాయపడ్డారు. అక్టోబరు 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు గెహ్లాట్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడంపై పార్టీ వర్గాలు కస్సుమంటున్నాయ్.

రాజస్థాన్ సంక్షోభం తారాస్థాయికి చేరడంతో, పార్టీ మరో ట్రబుల్ షూటర్ కమల్ నాథ్ ఢిల్లీకి చేరుకుని సోనియా గాంధీని కలిశారు. ఐతే కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని. నవరాత్రి శుభాకాంక్షల చెప్పేందుకు ఢిల్లీ వచ్చానని ఆయన అన్నారు. ఐతే రాజస్థాన్ సంక్షోభాన్ని చల్లార్చి మధ్యవర్తిత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు మూకుమ్మటి రాజీనామాలు చేస్తారంటూ వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో పెనుదుమారం రేగింది. గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను అంగీకరించబోమని ఎమ్మెల్యేలంతా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలందరూ నిన్న పార్టీ సమావేశానికి దూరంగా ఉండటంతోపాటు… అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గేలతో మాట్లాడటానికి నిరాకరించారు. పార్టీ ప్రతినిధులు ఒక్కొక్కర్ని విడివిడిగా కలవాలని కోరారు. ఎమ్మెల్యేల వైఖరితో విసిగిపోయిన అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. గెహ్లాట్ వర్గం నేతలు పార్టీ ప్రతినిధులను కించపరిచిందని మాకెన్ అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత మాత్రమే కొత్త ముఖ్యమంత్రిపై ఏదైనా సమావేశాన్ని నిర్వహించాలనే ఎమ్మెల్యేల డిమాండ్‌పై మాకెన్ మండిపడ్డారు. అశోక్ గెహ్లాట్ ఇప్పటికే పార్టీ చీఫ్‌గా ఎన్నికకానున్నప్పుడు… ఇప్పుడు ఇలాంటి తీర్మానాలు ఆమోదించడం పరస్పర విరుద్ధప్రయోజనాల కిందకు వస్తాయని అన్నారు. రాజస్థాన్‌లో వారసుడిని నిర్ణయించుకోవడానికి అవకాశమిచ్చినట్టు అవుతుందన్నారు. పార్టీ నేతల తీరును క్రమశిక్షణారాహిత్యం ఆయన అభివర్ణించారు. ఢిల్లీ పెద్దలకు రాజస్థాన్‌లో ఎదురైనా పరాభవంతో… కాంగ్రెస్ పార్టీపై గాంధీ ఫ్యామిలీకి పట్టు ఉందా అన్న చర్చ మొదలైంది. తాజా పరిణామాలు గాంధీలు పార్టీపై పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తున్నాయి. పార్టీలోని కొందరు నాయకులు గెహ్లాట్‌ను తక్కువగా అంచనా వేసారని, రాజస్థాన్‌లో అధికార మార్పిడి వ్యవహారాన్ని చాలా తక్కువగా అంచనా వేశారన్న వర్షన్ ఉంది.

గెహ్లాట్ రాజస్థాన్‌ను విడిచిపెట్టి… జాతీయరాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదని అర్థమవుతోంది. ఒకవేళ అవసరమైతే తాను రెండింటినీ నిర్వహించగలనని… ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిన అవసరం లేదని గాంధీలకు కూడా తేల్చిచెప్పాడు. కానీ రాహుల్ గాంధీ బహిరంగంగా ఒక వ్యక్తికి ఒక పదవేనంటూ కుండబద్ధలుకొట్టేశాడు. ఒక వ్యక్తి, ఒకే పోస్ట్ అని తేల్చి చెప్పాడు. రాహుల్ వ్యాఖ్యలతో గెహ్లాట్ వెనక్కి తగ్గినట్టుగా కన్పించాడు. కానీ రాజస్థాన్‌ను తన ప్రత్యర్థి సచిన్ పైలట్‌కు అప్పగించేందుకు సుతరామూ ఇష్టం లేడని అర్థమైపోయింది. ఐతే తిరుగుబాటులో ఎలాంటి పాత్ర లేదని గెహ్లాట్ కొట్టిపారేసినప్పటికీ, ఆయన ఆశీర్వాదం లేకుండానే రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంత పెద్ద అడుగు వేసే సాహసం చేస్తారని ఎవరూ అనుకోరు. 2020లో పైలట్ తిరుగుబాటుతో గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోతుందని అందరూ భావించారు. నాడు పైలట్ వర్గంలో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండోసారి గెహ్లాట్‌తో తప్పించాలని పార్టీ భావిస్తున్నా… పైలట్‌కు మాత్రం తగిన మద్దతు లేదని స్పష్టమైపోయింది.

