రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం
రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ రవాణాదారులు మాత్రం ఏదో విధంగా వాటిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో గురువారం అధికారులు భారీగా గంజాయి సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు తరలించే క్రమంలో ముందస్తు సమాచారంతో మహేశ్వరం ఎస్వోటీ సిబ్బంది, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. అధికారుల తనిఖీల్లో భాగంగా 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కంటైనర్ను కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
