ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ పోటీ?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్ పదవికి పోటీ చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భావిస్తున్నారు. 2025 వరకు బీసీసీఐలో కొనసాగేందుకు గంగూలీ, జై షా లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా గంగూలీ ఐసీసీ పదవిపైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్‌లీ పదవీ కాలం వచ్చే నవంబరులో ముగుస్తుంది. అయితే.. మరో రెండేళ్లు ఆ పదవిలో కొనసాగాలని ఆయన భావిస్తున్నారు. ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 9 మంది డైరెక్టర్లు ఎవరికి ఓటేస్తారో వాళ్లే ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవుతారు. ఈ నేపథ్యంలో గంగూలీ పోటీ చేసేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎన్నికైతే ఆ పదవి పొందిన ఐదవ భారతీయుడిగా నిలుస్తాడు. ఇంతకుముందు ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్, శశాంక్ మనోహర్, జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్ బాధ్యతలు నిర్వహించారు.

బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా..!
ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ ఎన్నికైతే భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా ప్రస్తుత కార్యదర్శి 33 ఏళ్ల జై షా ఎన్నిక కావడం లాంఛనమే అని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోశాధికారిగా ఉన్న అరుణ్ ధుమాల్ కార్యదర్శిగా ప్రమోట్ అవుతారు. ఈ టీంకు దేశంలోని 15 రాష్ట్రాల క్రికెట్ సంఘాలు మద్దతిస్తున్నాయి. జై షా వల్లే కొవిడ్ సమయంలోనూ ఐపీఎల్ నిర్వహించగలిగామని క్రికెట్ సంఘాలు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఐపీఎల్ ప్రసార హక్కులను రూ.48,390 కోట్లకు విక్రయించడంలోనూ జై షా పాత్ర ఉంది. మొత్తానికి జై షా ఉంటే బీసీసీఐకి ఆదాయం భారీగా పెరుగుతుందనడంలో సందేహం లేదని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

