పూజలందుకునేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబు
◆ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వేడుకలకు సన్నాహాలు
◆ కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా ఇళ్లకే పరిమితమైన ఉత్సవాలు
◆ సుందరంగా ముస్తాబవుతున్న పందిళ్లు
◆ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ సర్కారంటున్న విపక్షాలు
◆ రాజకీయ పార్టీల వారిగా పోటాపోటీగా విగ్రహాల ఏర్పాటు
రెండు తెలుగు రాష్ట్రాలు గణనాధుని భారీ వేడుకలకు సిద్ధమయ్యాయి. వినాయక చవితి కోసం ఎక్కడికక్కడ బొజ్జ గణపయ్య విగ్రహాలు రెడీ అవుతున్నాయి. కరోనా మహమ్మారితో గత రెండేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితమవగా… ఈ సంవత్సరం గణనాధుని ఉత్సవాల నిర్వహణకు అన్నిచోట్లా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనుండటంతో భక్తులు, నిర్వాహకులు ఆనందంలో ఉన్నారు. కరోనా ఉధృతి తగ్గటంతో ఈ ఏడాది ప్రభుత్వాలు కూడా ఏ ఆంక్షలు విధించకపోవడంతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల వారీగా వినాయకుని విగ్రహాలు పోటాపోటీగా సిద్ధం చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ సంవత్సరం భక్తుల మనసు దోచుకునే విధంగా వివిధ ఆకృతుల్లో బొజ్జ గణపయ్యల విగ్రహాలు తయారయ్యాయి. ఇప్పటికే ప్రజలో చైతన్యం రావటంతో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెరగటంతో ఈసారి గణేష్ ఉత్సవాల్లో చాలాచోట్ల అలానే తమ తమ ఇళ్లల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులు మట్టి విగ్రహాలని ప్రతిష్టించుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

పెద్ద పెద్ద భారీ విగ్రహాలను మట్టితో చేసేందుకు నిష్ణాతులైన కళాకారులను బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కలకత్తా తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి కమిటీల వారు ఇప్పటికే విగ్రహాలను తయారు చేయించారు. గత మూడు ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం విగ్రహాల తయారీ ,నిర్వహణ ఖర్చు భారీగా పెరిగిందని మండపాల నిర్వహకులు చెబుతున్నారు. ఇప్పటికే రంగులు అద్దుకుని ఆకర్షణీయంగా ముస్తాబైన వినాయక విగ్రహాలు రేపు వినాయక చవితి సందర్భంగా పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి ఏపీలో వేడుకలకు తెలంగాణలోని అతిపెద్ద ఖైరతాబాద్ వినాయక విగ్రహం తరహాలో విజయవాడలో కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం ఇప్పటివరకు ఖైరతాబాద్ విగ్రహం తరహాలో ఏ జిల్లాలో కూడా వినాయకుడిని అంతస్థాయిలో ప్రతిష్టించకపోవడంతో ఈసారి అదే తరహాలో రికార్డు స్థాయిలో విజయవాడలో విగ్రహాన్ని ఖైరతాబాద్ వినాయకుడు తరహాలోనే భారీ పందిరి వేసి నిర్వాహకులు తయారు చేయించారు.

కానీ గణనాథుని పండుగ కోసం ఏపీ ప్రభుత్వం వివిధ రకాల నిబంధనలు విధించడంతో వినాయక చవితి రాజకీయ రంగు పులుముకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వినాయక ఉత్సవాలకు ఫైర్, మైక్ అనుమతులు అంటూ నిబంధనలు పెట్టటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వినాయక చవితి పందిళ్లు, మండపాలు పూజలు జరుపుతామని ఎవరు అడ్డు వచ్చిన తగ్గేదే లేదని ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు నిబంధనలు పెట్టిన ఈసారి గణనాథని ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రజలు అన్ని విధాల సమాయత్తమయ్యారు.

