గణేష్ లడ్డూ వేలం పాట అక్షరాల 60 లక్షలు
గణేష్ లడ్డూ వేలంపాట అనగానే అందరూ ఎక్కువగా బాలాపూర్ లడ్డూ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ బాలాపూర్ లడ్డూ సరి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది కాబట్టి. అయితే ఈసారి మాత్రం బాలాపూర్ లడ్డూ ధరను శనివారం అల్వాల్ లడ్డూ దాటేయగా.. అల్వాల్ లడ్డూ రికార్డును తాజాగా బండ్లగూడలో వేలం వేసిన గణేష్ లడ్డూ బ్రేక్ చేసి… రాష్ట్రంలోనే కొత్త రికార్డ్ నమోదుచేసింది.
.

రాజేంద్రనగర్ బండ్లగూడ పరిధిలోని సన్‌సిటీ కీర్తీ రిచ్మండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా కాలనీలో గణేశుడి లడ్డూ ధర రాష్ట్రంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా బాలాపూర్ లడ్డూ, అల్వాల్ మరకత లక్ష్మీగణపతి లడ్డూ ధరనే దాటేసింది. ఈరోజు జరిగిన వేలంలో ఎవరూ ఊహించని రీతిలో లడ్డూ ధర రూ.60.80లక్షలు పలికింది. డాక్టర్ సాజీ డీసౌజా బృందం ఇంత భారీ మొత్తం వెచ్చించి లడ్డూను సొంతం చేసుకొంది.

గణనాథుని లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సాజీ డీసౌజా తెలిపారు. కులం, మతం కన్నా మానవత్వమే ముఖ్యమని అన్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బులను.. ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని నిర్వాహకులు చెప్పారు. ఇదిలా ఉండగా అల్వాల్ పరిధిలోని కానాజిగూడలోని మరకత లక్ష్మీగణపతి లడ్డూను రూ.45,99,999 లక్షలకు హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకట్రావు దంపతులు దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూను రూ.24 లక్షల 60 వేలకు ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే.