Home Page SliderNationalNews Alert

గాలి జనార్ధన్‌ రెడ్డి కుటుంబానికి తీవ్ర నిరాశ.. ముగ్గురి ఓటమి

కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్‌ రెడ్డి కుటుంబానికి తీవ్ర నిరాశ ఎదురైంది. కుటుంబం నుంచి నలుగురు పోటీ చేస్తే కేవలం గాలి జనార్ధన్‌ రెడ్డి మాత్రమే గెలుపొందారు. సొంతంగా కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో గాలి జనార్దన్‌ రెడ్డి పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తరుఫున 15 మంది బరిలోకి దిగితే… కేవలం గాలి మాత్రమే గెలిచారు. ఆయన గంగావతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బళ్లారి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన జనార్దన్‌ రెడ్డి భార్య లక్ష్మీ ఓటమిపాలయ్యారు. ఇదే బళ్లారి పట్టణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా పరాజయం చెందారు. ఈ నియోజకవర్గంలో గాలి జనార్ధన్‌ రెడ్డి భార్య, సోదరుడు ఇద్దరూ పోటీ పడటం గమనార్హం. ఇద్దరి మధ్య పోటీ కాంగ్రెస్‌ పార్టీకి ప్లస్‌ అయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నారా భరత్‌ రెడ్డి గెలుపొందారు. హరపనహళ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మరో సోదరుడు కరుణాకర్‌ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికలు గాలి కుటుంబానికి తీవ్ర నిరాశను మిగిల్చాయనే చెప్పవచ్చు.