అన్నాడీఎంకే మాజీ ఎమ్మేల్యే కిడ్నాప్
తమిళనాడులో మాజీ ఎమ్మేల్యే కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టించింది. అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మేల్యే ఈశ్వరన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అంతేకాకుండా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ కిడ్నాప్ వెనుక అదే పార్టీకి చెందిన మాజీ నేత హస్తం ఉందని పలురకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వరన్ 2016 నుంచి 2021 వరకు అన్నాడీఎంకే తరుపున భవానీసాగర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మేల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భుజంగనూరులో నివశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం ఆయన కిడ్నాప్‌కు గురయ్యారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆయనపై దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. దీంతో ప్రాథమిక చికిత్స కోసం ఈశ్వరన్‌ను సత్యమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూర్ జిల్లాలోని ప్రధాన హాస్పటల్‌లో చేర్పించారు. ఈ కిడ్నాప్,దాడికి సంబంధించి పుంజై పులియంపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చికిత్స అనంతరం కోలుకున్న ఈశ్వరన్ కిడ్నాప్ గురించి మాట్లాడారు. రెండు రోజుల క్రితం తాను ద్విచక్రవాహనంపై పులియంపట్టి నుంచి భవానీసాగర్‌కు వెళుతున్నారన్నారు. ఈ క్రమంలోనే 6గురు సభ్యులు కలిగిన ఒక ముఠా తనను బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారన్నారు. తరువాత దాదాపు అరగంటపాటు తనను ఆ కారులోనే తిప్పారన్నారు. ఈ నేపథ్యంలో తనపై దాడి చేసి,చిత్రహింసలకు గురి చేశారని వెల్లడించారు. తనను ఏమి చేయకుండా ఉండాలంటే కోటి యాభై లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారన్నారు. అయితే తన కిడ్నాప్ వెనుక మాజీ మిలిటరీ నేత శరవణన్‌పై అనుమానం ఉందన్నారు. ఈ మేరకు ఆయనపై పోలీసులుకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు.