క్యాబ్ ఆలస్యంగా వచ్చినందుకు… 20 వేలు జరిమానా !
ముంబైకి చెందిన ఓ కన్జ్యూమర్ కోర్టు ఉబర్ ఇండియా క్యాబ్ సంస్థకు 20 వేలు రూపాయలు జరిమానా విధించింది. క్యాబ్ డ్రైవర్ ఆలస్యం వల్ల ఫ్లైట్ మిస్సైనందున ముంబై నగరంలోని డోంబివ్లికి చెందిన అడ్వకేట్ కవితా శర్మ కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. 2018 నుంచి ఈ కేసులో పోరాటం చేస్తున్న కవితాశర్మ.. ఎట్టకేలకు ఉబర్ ఇండియా క్యాబ్ సంస్థకు 20వేల జరిమానా కోర్టు విధించింది. క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తికి ఆలస్యంగా సేవలు అందించిన కారణంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది.

2018 జూన్ 12న ముంబై నుండి చెన్నైకి ఆమె ఫ్లయిట్ బుక్ చేసుకుంది. అయితే… ఎయిర్‌పోర్టుకు వెళ్ళడానికి ఉబర్ క్యాబ్ 14 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దారి మధ్యలో డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రయాణాన్ని మరింత ఆలస్యంగా తీసుకెళ్ళాడు. ఆపై వేరే రూట్‌లో డ్రైవర్ తీసుకెళ్తూ.. దారిలో సీఎన్‌జీ గ్యాస్ కూడా ఫీల్ చేశాడు. దీంతో 15-20 నిమిషాలు మరింత ఆలస్యమైంది. అప్పటికే ఫ్లైయిట్ మిస్సయింది. దీంతో మరో టికెట్ కొనుక్కొని వేరే ఫ్లైయిట్‌లో వెళ్లాల్సి వచ్చిందని కంప్లైంట్‌లో ఆమె పేర్కొంది.

ఇదిలా ఉండగా.. యాప్ బుక్ చేసుకున్న సమయంలో ట్రిప్ రేటు రూ. 563 చూపించగా… చివరకు ఉబర్ రూ. 703 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. దీనిపై ఉబర్‌కు కంప్లైంట్ చేస్తే రూ. 139 రిటర్న్ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేశారని కవితా శర్మ తెలిపారు. తొలుత ఉబర్ సంస్థకు న్యాయపరమైన నోటీసులు పంపితే… ఎలాంటి స్పందనా రాలేదు. కన్జ్యూమర్ కోర్టు ఆశ్రయించిన తర్వాత ఉబర్ సంస్థ వివరణ ఇచ్చింది. కేవలం కస్టమర్, డ్రైవర్ల మధ్య అనుసంధానం చేసే ప్లాట్‌ఫాం మాత్రమేనని ఉబర్ తెలిపింది. అయితే.. యాప్‌ను కంపెనీయే నిర్వహిస్తున్న నేపథ్యంలో కస్టమర్ల సేవలకు బాధ్యత వహించాల్సిందేనని కన్జ్యూమర్ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఖర్చుల కింద 10,000 వేలు, మానసికంగా వేదనకు గురి చేసినందకు మరో రూ. 10,000 చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.