HealthHome Page SliderInternational

ఆరోగ్యానికి ఐదు చక్కటి అలవాట్లు

వైద్యనిపుణుల సలహా ప్రకారం ఐదురకాల మంచి అలవాట్లు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు.

వీటిలో మొదటిది సరైన నిద్రగా వైద్యులు చెప్తున్నారు. రోజూ ఒకే సమయానికి నిద్రకుపక్రమించడం, లేవడం చేస్తుంటే ఎలాంటి అనారోగ్యమూ రాదంటున్నారు. కనీసం సగటున మనిషికి ఆరు నుండి ఎనిమిది గంటల పూర్తి నిద్ర అవసరం. అది వయసుల వారీగా మారవచ్చు కానీ, యుక్త వయస్సులో ఉండి పనులు చేసే వారికి ఈ సమయంలో నిద్ర అవసరం.

సమతుల్య ఆహారం తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రకరకాల డైట్ల పేరుతో ఏవేవో ఆహార పదార్థాలు తినేకన్నా మన పూర్వికులు ఏది తినేవారో పారంపర్యంగా అదే తినడం మనకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. భోజనం చేయగానే ఒక 15 నిమిషాలు నడవాలి. కూర్చుని చేసే ఉద్యోగాలు అయినా ప్రతీ గంటకి ఐదు నిమిషాల బ్రేక్ అవసరం అంటారు.

మూడవది బాడీ మెయింటెనెన్స్. కారును క్రమం తప్పకుండా సర్వీస్ చేయిస్తున్నట్లుగానే మన శరీరానికి కూడా అప్పుడప్పుడు సర్వీస్ అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యాలను గుప్పెట్లో పెట్టుకోవడం చాలా మంచి అలవాటు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారపు అలవాట్లు శరీరానికి సర్వీస్ అయితే, అప్పుడప్పుడు రిలాక్స్ అవడం, డైలీ రొటీన్ నుండి బ్రేక్ తీసుకుని వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడం మనసుకు సర్వీస్ లాంటింది.

స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలతో గడపడం, పెంపుడు జంతువులతో గడపడం చాలా రిలాక్స్ కలిగిస్తుంది. కొందరికి సంగీతం అంటే ఇష్టం, కొందరికి నృత్యం అలా వారికిష్టమైన పని చేస్తూ గడపడం వల్ల స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చు.

హెల్త్ చెకప్‌లు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా మంచి అలవాటు. బీపీ, షుగర్ ఉండేవారు రక్తపరీక్షలు, ఈసీజీలు వంటివి తీసుకోవడం, మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి డాక్టర్ల సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఈ అలవాట్లు అలవరచుకుంటే చక్కటి ప్రణాళికాబద్దమైన జీవితాన్ని గడుపుతూ మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.