ఆ యూట్యూబర్ ఆచూకీ చెబితే రూ.25 వేలు
ఇటీవల విమానంలో పొగతాగుతూ.. రోడ్డుపై మద్యం సేవిస్తూ.. వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్ బాబీ కటారియా కోసం పోలీసులు గాలిస్తున్నారు. డెహ్రాడూన్‌లో మార్గమధ్యంలో మద్యం సేవించి ట్రాఫిక్ జామ్‌కు కారణమైన కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యూట్యూబర్ బాబీ కటారియా ఆచూకీ తెలిపిన వారికి రూ.25,000 రివార్డు ఇస్తామని ప్రకటించారు. నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కటారియాను అరెస్ట్ చేసేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఆతని నివాసంలో సోదాలు నిర్వహించారు.

కానీ అతను పారిపోయాడు. అతడిని అరెస్టు చేసిన వారికి రూ.25,000 రివార్డు ప్రకటించినట్లు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ దిలీప్ సింగ్ కున్వర్ తెలిపారు. ముస్సోరీలోని కిమాడి మార్గ్‌లో రోడ్డు మధ్యలో టేబుల్ వేసి మద్యం సేవించి.. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నాడని తెలిపారు. మద్యం మత్తులో రోడ్డుపై స్పీడ్‌గా డ్రైవ్ చేశాడని అన్నారు. బాబీ కటారియాపై ఐటీ చట్టంలోని 342, 336, 290, 510, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు దిలీప్ సింగ్ తెలిపారు.

