Andhra Pradesh

ఆలమూరులో పరువు హత్య కలకలం

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పేట్రేగిపోతున్నాయి. తమ పరువు తీస్తున్నారన్న కోపంతో కన్న తల్లిదండ్రులే తమ బిడ్డలను కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే ఆంధ్రలో  చోటు చేసుకుంది.  నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో కన్నతండ్రే తన కుమార్తెను అతి కిరాతకంగా హతమార్చాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాణ్యం పోలీసులు తెలిపిన ప్రకారం మృతురాలి వివరాలు ఇలా ఉన్నాయి. ఆలమూరు గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె ప్రసన్నకు రెండేళ్ల క్రితం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం అనంతరం పెద్దకుమార్తె భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటుంది. అయితే గతంలో ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించినట్లు తెలుస్తోంది. కాగా ప్రసన్న తాను ప్రేమించిన వ్యక్తిని కలుసుకునేందుకు ఇటీవల తన గ్రామానికి వచ్చింది. మళ్లీ తన భర్త దగ్గరకు తిరిగి వెళ్లలేదు.

దీంతో తన పరువు పోయిందని భావించిన ప్రసన్న తండ్రి ఆమెపై విపరీతంగా కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను ఈ నెల 10న గొంతు నులిమి హతమార్చాడు. కుమార్తెను హతమార్చిన తరువాత కొంతమందితో కలిసి ఆమె మృతదేహాన్ని కారులో నంద్యాల-గిద్దలూరు మధ్యలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ప్రసన్న మృతదేహం నుంచి తలని వేరు చేశారు. అనంతరం తలని ఒకచోట అలాగే మొండాన్ని మరోచోట విసిరేశారు. అలా చేసి తిరిగొచ్చిన తండ్రి ఏం తెలియనట్లు ఉన్నాడు. అయితే ప్రసన్న, తాతకు కొన్నిరోజులుగా ఫోన్ చేయకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. ఈ క్రమంలోనే ప్రసన్న తాత దేవేంద్ర రెడ్డిని గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. తన పరువు తీసిందనే కారణంతోనే ప్రసన్నను హతమార్చినట్లు దేవేంద్రరెడ్డి తెలిపారు. దీంతో దేవేంద్రరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు రెండురోజుల క్రితం  దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని మృతదేహన్ని పడేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ రోజంతా గాలించినప్పటికీ వారికి మృతదేహం దొరకలేదు. అయితే నిన్న మళ్లీ గాలించగా తల,మొండం దొరికాయి. పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.