సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
సిద్దిపేట జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం మునిగడప వద్ద కారు అదుపు తప్పి కేనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. కారు బ్రిడ్జి కల్వర్టును ఢీకొని కాలవలో పడిపోయింది. వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు.