మణిపూర్‌లో చావలేక బ్రతుకుతున్న బాధిత కుటుంబాలు
తాము చావలేక బ్రతుకుతున్నామంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు మణిపూర్ బాధిత మహిళల కుటుంబాలు. మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించింది. దేశవ్యాప్తంగా వారికి ఎందరో మద్దతు పలుకుతున్నా దగ్గరకొచ్చి పలుకరించేవారు లేక కుమిలిపోతున్నారు. వీరిని ఓదార్చే తోడు లేక జీవచ్ఛవాలుగా బ్రతుకీడుస్తున్నారు. వీరిని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అక్కున చేర్చుకుని ఓదార్చారు. తమకు ధైర్యం చెప్పేవారే లేరని, వారు ఆమె ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు బాధిత మహిళలలో ఒకరు మాజీ సైనికుడి భార్య. ఆయన సర్వీసులో ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధంలో పోరాడి, భారత్‌ను కాపాడారు. అలాంటి వ్యక్తి కూడా తన భార్యను రక్షించుకోలేక కన్నీరు పెట్టుకున్నాడని ఆమె పేర్కొన్నారు. ఏ ఒక్క నాయకుడు తమవైపు కన్నెత్తి చూడలేదని వారు వివరించారు. దీనితో ఆమె అక్కడ రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డారు. తనకు కూడా మణిపూర్ చూడడానికి శాంతి భద్రతల పేరుతో అనుమతి నిరాకరించారని, కానీ నేరుగా ముఖ్యమంత్రిని కలిసి, అనుమతి తీసుకున్నానని తెలిపారు. అక్కడి పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న మహిళలను కూడా పరామర్శించానని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు.