నకిలీ రామ్ ఐపీఎస్ లీలలు- ఆటకట్టించిన సైబరాబాద్ పోలీసులు
ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ చెప్పుకుంటున్న నకిలీ ఐపీఎస్ ఆటకట్టింటారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ డీసీపీ శ్రీనివాసరావు అతనిని అరెస్టు చేసి వివరాలు మీడియా ముందు వెల్లడించారు. రామ్ ఐపీఎస్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, మాజీ ఆర్మీ కల్నల్‌గా అవతారాలెత్తాడు భీమవరానికి చెందిన కార్తీక్. ఒక మహిళను మోసం చేసి కిడ్నాప్ చేసిన వ్యవహారంలో ఈ విషయం కనిపెట్టారు సైబరాబాద్ పోలీసులు. తెలంగాణా పోలీస్ ఒకరు మహిళను కిడ్నాప్ చేసారంటూ వచ్చిన కేసు విషయంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఈ ఐపీఎస్ రామ్ చిక్కాడు.

అతడెంత మహా నటుడంటే ఐపీఎస్ బ్యాచ్ పేర్లు, టాప్ ఆఫీసర్ల పేర్లు కూడా తెలుసుకుని అలవోకగా పోలీసులనే బురిడీ కొట్టించగలడు. అచ్చంగా నార్త్ ఇండియన్స్‌లా హిందీ మాట్లాడుతూ, ఆర్మీ ఉద్యోగంలో పెద్ద పొజిషన్‌లో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. ఉద్యోగాలు ఇప్పించగలనని, కేంద్రప్రభుత్వం కొలువులలో సెటిల్ చేస్తానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. గవర్నమెంట్ ఐడీ ఫ్రూఫ్స్‌ను తయారు చేసి, బాదితులతో సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఈ సెటిల్మెంట్ల కోసం సైబరాబాదులో ఏకంగా ఒక కార్యాలయాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని వద్ద గల ఒక కంట్రీమేడ్ పిస్టల్‌ను, అతనికి చెందిన 23 వస్తువులను సీజ్ చేశారు పోలీసులు. ఏకంగా క్రికెట్ స్టార్ ధోనీ ఉన్న మిలటరీ ఫొటోలో కూడా రామ్ ఫొటోను ఏర్పాటు చేసుకున్నాడు. ఫేక్ ఫొటోలతో, ఫేక్ ఐడీ ఫ్రూఫ్స్‌తో ప్రజలను నమ్మించి, మోసం చేస్తున్నాడు ఈ కార్తీక్. దేశవ్యాప్తంగా ఇతనిపై 8 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.