ఇమ్రాన్ అర్టెస్ట్‌కు రంగం సిద్ధం!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇమ్రాన్ అరెస్టుపై పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇమ్రాన్‌ఖాన్ చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తోంది . ఇమ్రాన్‌ఖాన్ పై ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసు విచారణ లో ఉంది. ప్రోటెక్షన్ బెయిల్ ఆగస్టు 25వ తేదీతో ముగిసిన వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకుంటామని పాక్ అంతర్గత భద్రతా మంత్రి రానా సనావుల్లా తెలిపారు. పూర్తి న్యాయ సలహా తీసుకున్నాకే ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయబోతున్నామని సనావుల్లా తాజాగా ప్రకటించడం పాకిస్థాన్ రాజకీయాల్లో దుమారం రేపింది.

ఇమ్రాన్ ఖాన్ మీద ఇప్పటికే ఉన్న ఉగ్రవాద వ్యతిరేక చట్టం కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు ప్రీ-అరెస్టు బెయిల్ ను మంజూరు చేసింది. యాంటీ టెర్రరిస్టు కోర్టును కూడా ఆశ్రయించాలని సూచించింది. అయితే ఇమ్రాన్‌ఖాన్ ఆగస్టు 20వ తేదీన ఇస్లామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వంతో పాటు న్యాయ వ్యవస్థపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. సైన్యం, ప్రభుత్వ అధికారులు, మహిళా జడ్జి, పోలీసులపై ఆయన ఆరోపణలు గుప్పించారు. తాజాగా కోర్టు ధిక్కార కేసును కూడా ఇమ్రాన్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనపై ఉగ్రవాద నిరోధక చట్టం సెక్షన్-7 కింద కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో.. ఆగస్టు 25వ తేదీన ఇమ్రాన్ ఖాన్ అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ప్రధాని పదవి కోల్పోయిన ఆయన ప్రజల మద్దతును కూడగట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.. పాకిస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయపడ్డారు.


 
							 
							