“అందరి తెలంగాణ కావాలి.. కొందరి తెలంగాణ కాదు”
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జాగృతి జనం బాట’ యాత్రలో భాగంగా నిజామాబాద్‌లో పాల్గొన్న కవిత మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు.
“నా లక్ష్యం అందరి తెలంగాణ కావాలి. కొందరి తెలంగాణ మాత్రమే కాకూడదు,” అని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో తానికీ తెలియదని ఆమె అన్నారు. పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని తనను బయటకు పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేసానని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని కవిత వెల్లడించారు. తెలంగాణ కోసం తాను ఎప్పుడూ ప్రజలతో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాగృతి వేదికగా పనిచేస్తూనే ఉంటానని తెలిపారు.
జాగృతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని పేర్కొన్న కవిత, తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మళ్లీ ప్రజల్లో నింపడం లక్ష్యమని చెప్పారు.

