తిరిగొచ్చాక కూడా వారికి సమస్యలే..
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అనుకోని పరిస్థితులలో ఎనిమిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సంగతి తెలిసిందే. వీరిని రప్పించేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకూ తీసుకురాలేకపోయారు. తాజాగా వారు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో మార్చి 19న భూమి మీదకు బయలు దేరనున్నారని సమాచారం. అయితే జీరో గ్రావిటీ నుండి తిరిగి వస్తున్న వారికి కొన్నాళ్ల పాటు ఇక్కడ సమస్యలు ఏర్పడనున్నాయని స్వయంగా విల్మోర్ మీడియాకు వెల్లడించారు. తిరిగి వచ్చాక శరీరమంతా భారమైన భావన కలుగుతుంది. మైక్రోగ్రావిటీ పరిస్థితులలో ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించడానికి ఎర్ర రక్త కణాలు కాస్త తగ్గిపోతాయి. దీనివల్ల అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినవచ్చు. ఎముకల సాంద్రత తగ్గిపోవడం, గుండె పనితీరు దెబ్బతినవచ్చు. వారు కనీసం పెన్సిల్ లేపినా వర్కౌట్ చేసినంత కష్టపడాల్సి ఉంటుందట.

