Home Page SliderTelangana

పీఎం కృషి సంవృద్ది కేంద్రాల ప్రారంభోత్సవం లైవ్‌లో ఈటల రాజేందర్

రాజస్థాన్‌లో జరుగుతున్న ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాల” ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ షాద్ నగర్ బస్టాండ్ వద్ద ఉన్న గణేష్ అగ్రో ఏజెన్సీస్ లో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారి లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ” స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ల తరువాత రైతుల బాధలు, దుఖాన్ని అర్థం చేసుకొనే ప్రభుత్వం వచ్చింది. వారి మేలు కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది. ఈ పథకం ద్వారా కోట్ల మంది రైతులకు వారి భూమికి భూసార పరీక్షలు చేస్తున్నాం. కిసాన్ సమృద్ది కేంద్రాలు “ఒన్ స్టాప్ సెంటర్”. రైతులకు అవసరం అయిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి. ఇంకా 1 లక్ష 75 వేల ప్రధాన మంత్రి కృషి సంవృద్ది కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తాం. కరోనా మహమ్మారి వల్ల, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఫెర్టిలైజర్ ధరలు పెరిగినా కూడా ఆ భారం రైతుల మీద పడనీయలేదు” అన్నారు.

రైతులకు అవసరమైన యూరియా 2503 రూపాయలు ఉంటే, ప్రభుత్వం రైతులకు 267 రూపాయలకే అందిస్తుంది. కేంద్రం ఇస్తున్న సబ్సిడీ 2236 రూపాయలు. దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచాం. మాతృ భాషలో చదువుకొనే అవకాశం కలిపిస్తున్నాం. కలలు పెద్దగా కంటేనే ఫలితాలు పెద్దగా ఉంటాయి. కోట్లమంది రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు చేపడుతున్నాము. 18 వేల కోట్లు ఈ రోజు రైతుల అకౌంట్స్ లో జమ అయ్యింది. ఈరోజు లక్షా 25 వేల కిసాన్ సమృద్ది కేంద్రాలు ప్రారంభంచేసుకున్నాం. అని పేర్కొన్నారు.

నేడు రాజస్థాన్‌లో ప్రధాని మోదీ కృషి సంవృద్ధి కేంద్రాలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. “ప్రధాని మోదీ 11 కోట్లమంది రైతులకు ప్రధాని సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకున్నారని ప్రపంచ ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధర పెరిగినా మన దేశంలో పెరగకుండా రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందిస్తున్నారు. పంటకి 5 వేల రూపాయలు ఇచ్చి అన్నీ నేనే ఇచ్చిన అని కెసిఆర్ చెప్పుకుంటున్నారు. అది ఇచ్చి అనేక పనిముట్ల సబ్సిడీ తొలగించారు. పవర్ స్ప్రే,  రోటావేటర్లు, చిన్న ట్రాక్టర్, కల్టివెటర్ ఇవ్వడం లేదు. డ్రిప్, గ్రీన్ హౌస్ సబ్సిడీ ఎత్తివేశారు.  కేసిఆర్ వచ్చాక సబ్సిడీ విత్తనాలు లేవు, ఎరువులు లేవు. ఇదేనా అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అంటే? కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 పైసలు ఇవ్వని కేసిఆర్ మన డబ్బులు తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో ఇవ్వడం సిగ్గుచేటు. పేరుకే రైతు ప్రభుత్వం తప్ప చేతల్లో లేదు.” అంటూ మండిపడ్డారు.

“కేంద్రం వల్ల 422 కోట్ల రూపాయలు రంగ రెడ్డి జిల్లా రైతులకు అందింది. ప్రజల ఆశీర్వాదంతో గెలిపిస్తే రైతులకు కన్నీళ్లు లేకుండా చేస్తాం.  కౌలు రైతులకు భద్రత కలిపిస్తాం.  సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇంప్లిమెంట్ ఇస్తాం అని హామీ ఇస్తున్నాం. రైతులు బాగుంటే పల్లెలు, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని గాంధీజీ చెప్పినట్టు గ్రామస్వరాజ్యమే మా లక్షం అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు మరోసారి ప్రకటించారు.  మేము వస్తె నిజమైన రైతురాజ్యం తీసుకువస్తాం”. కేసిఆర్ మోసపు మాటలు నమ్మవద్దు అని రైతాంగాన్ని కోరుతున్నానని ఈటల రాజేందర్ అన్నారు.