ఉద్యోగులకు అండగా ఈటల
తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పర్మినెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎలా కమిటీలను ఏర్పాటు చేశారో, అదే తరహాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేయాలని BJP ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మహా ధర్నాలో పాల్గొన్న ఈటల, ఈ ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ శాఖలు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. సర్వీస్ సెక్టార్‌లో పని చేస్తున్న ఈ ఉద్యోగులకు ఈపీఎఫ్, హెల్త్ కార్డులు, వేతన సెలవులు వంటి హక్కులు ఇప్పటికీ లభించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ పేరిట ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం అన్యాయం అని విమర్శించారు. “నాకు పార్టీలు, పదవులు మనసులో లేవు. నేను ప్రజల పక్షాన నిలవడం నా కర్తవ్యం. జీఎస్టీ రద్దు కోసం పార్లమెంటులో విషయాన్ని ప్రస్తావిస్తాను,” అని స్పష్టం చేశారు.