మీ రుణం ఎలా తీర్చుకోను…ఈటల రాజేందర్
మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. తనను గెలిపించిన మల్కాజ్ గిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ” మల్కాజ్ గిరి నియోజక వర్గంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఢిల్లీలో రైల్వే మంత్రి వద్ద మన సమస్యలు అన్నీ పెట్టాం. రైల్వే అధికారులతో రేపు 11 వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. మల్కాజ్ గిరిలో కంటోన్మెంట్ రోడ్ల గురించి రాజనాధ్ సింగ్‌తో కూడా మాట్లాడాను. కాలనీల వారీగా సమస్యలు కూడా పరిష్కరిస్తామని మాటిస్తున్నాను. ఒక కార్పొరేటర్‌లా పని చేస్తాను. మల్కాజ్ గిరి ఎంపీ అంటే మీకు అందే ద్రాక్ష అనుకోండి. ప్రత్యక్షంగా మీతో కలిసి పని చేస్తాను. కంచే చేను మేస్తోందన్నట్లు ప్రభుత్వం పని చేస్తోంది. కష్టపడి కట్టుకున్న పేదవారి ఇళ్లను కూల్చేశారు. తమ తాత జాగీరులా అధికారులు ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నా పరిధిలో ఉండే కంటోన్మెంట్, రైల్వే పరిధిలో నేను నా వంతు పని చేస్తాను.
కానీ రాష్ట్రప్రభుత్వం నిరంకుశంగా పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. వర్షాకాలంలో జీహెచ్‌ఎంసీ ఏమాత్రం బాధ్యత తీసుకోవడం లేదు. భారీ వర్షాలకు డ్రైనేజిలు పొంగి పొరలుతున్నాయి. చెరువులలో గుర్రపు డెక్క పెరుగుతోంది. కార్పొరేటర్ల నుండి జీహెచ్‌ఎంసీ మేయర్ వరకూ అందరూ బాధ్యత వహించాలి. నేను చేసే పనుల విషయంలో మీరంతా నిశ్చింతగా ఉండొచ్చు. నాకెలాంటి అప్లికేషన్లూ ఇవ్వాల్సిన పని లేదు. బీజేపీకి ఈ పార్లమెంట్ నియోజక వర్గంలో నూటికి నూరుశాతం అన్ని అసెంబ్లీలలో గెలిపించిన ఘనత మీదే. గేటెడ్ కమ్యూనిటీలలో, కాలనీలలో ప్రజలు చైతన్యవంతంగా ఓట్లు వేసి గెలిపించినందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ప్రజలు నచ్చి, మెచ్చి నాకు ఓట్లు వేశారు. ఐదేళ్ల తర్వాత కూడా ఇదే అభిమానంతో నాకు ఓట్లు వేస్తారని నేను నమ్మకంగా చెప్తున్నా. ఎందుకంటే నేను చేసే పని అలా, మీరు మెచ్చేలా ఉంటుంది. అందుకే మేము ఈటల అన్నకు ఓట్లు వేశాం అని మీరు గర్వంగా చెప్పుకునేలా పనులు చేస్తానని మాట ఇస్తున్నాను. ఎక్కడ అధర్మం అన్యాయం ఉందో ఈటల పోరాటం ఉంటుంది. పదవి అనేది అలంకారం కాదు, రియల్ ఎస్టేట్ కోసం కాదు, ఇతరుల మీద కేసులు పెట్టడానికి కాదు, పదవి అనేది ప్రజలకు సేవ చేయడానికి అని నమ్మే వ్యక్తిని నేను. మీరు నాకు ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు ఇది మీకే అంకితం చేస్తున్నాను”.


 
							 
							