పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ – వేయి మంది మృతి
మన దాయాది దేశం పాకిస్తాన్ భారీ వర్షాల కారణంగా చిగురుటాకులా వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద బీభత్సానికి పాకిస్తాన్‌లో 343 మంది చిన్నారులతో సహా దాదాపు 937 మంది మృతి చెందారు. ఈ విపత్తులో సుమారు 30 మిలియన్లకు పైగా ఆశ్రయం కోల్పోయారని తెలిసింది. సింధూ ప్రావిన్స్‌లో అత్యధికంగా మరణించారని జాతీయవిపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 37 మంది, పంజాబ్ ప్రావిన్స్‌లో 165, బలోచిస్తాన్‌లో 234 మంది చనిపోయారని సమాచారం. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి, దేశంలోని పలు వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. వేలమంది నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్‌లో దాదాపు 23 జిల్లాలలో బాగా వరదలకు ప్రభావితమైనట్లు ఎన్వెఎండీఎ వెల్లడించింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టమని ఆదేశించారు.

