Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsPoliticsviral

తెలంగాణలో ఎలి లిల్లీ భారీ పెట్టుబడి

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ సంస్థ ఎలి లిల్లీ సంస్థ హైదరాబాద్‍లో రూ.9 వేల కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంస్థ ప్రతినిధులు ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్, ఎలి లిల్లీ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎలి లిల్లీ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పరిశ్రమలు పెట్టే వారికి మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నదని చెప్పారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని హైదరాబాద్ గ్లోబల్ సిటీ అన్నారు.

1965 లో ఇందిరాగాంధీ హైదరాబాద్‍కు ఐడీపీఎల్ తీసుకు రావడంతో ఫార్మా హబ్‍గా మారిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‍లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయని, 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‍లో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్‍లు హైదరాబాద్‍లోనే ఉత్పత్తి అయ్యాయన్నారు. ఫార్మా పాలసీ‍ని మా ప్రభుత్వం మరింత ముందుకు తీసుకు వెళ్తుందని, జినోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్‍ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జినోమ్ వ్యాలీకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అందిస్తామని తెలిపారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఫార్మకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు స్కిల్ యూనివర్సిటీ బోర్డు మెంబర్స్ గా ఉన్నారన్నారు.